పెట్టుబడిదారి సంస్కరణలు అవలంబిస్తే సంక్షోభం తప్పదు: ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్

నమస్తే శేరిలింగంపల్లి: అమెరికా ఆధిపత్యంలోని సామ్రాజ్య వాద, పెట్టుబడి దారి సంస్కరణలు విఫలమవుతున్నాయని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఎద్దేవా చేశారు. భారత మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐక్య) కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లో ప్రారంభమయ్యాయి. మొదటి రోజున పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కాటం నాగభూషణం అధ్యక్షతన జరిగింది. ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించారు. పెట్టుబడి దారి సంస్కరణలు అవలంభించిన దేశాలన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయని అన్నారు. ఆర్థిక అసమానతలు అమెరికాతో సహా ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ విధానాలపై‌ లాటిన్ అమెరికాలో‌ తీవ్ర అసంతృప్తి పెరిగి చిలీ, పెరూ లాంటి దేశాలలో వామపక్ష పార్టీలను ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. రాబోయే కాలంలో భారత్ లోనూ ఇలాంటి పరిణామాలు‌ చోటు చేసుకోనున్నాయని అన్నారు. ఈ సమావేశం లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజాదాస్, మహేందర్ నేహ, అనుభవదాసు‌శాస్త్రీ, తాండ్ర కుమార్, జార్జ్, జ్యోతిష్‌మండల్ తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజు కేంద్ర కమిటీ సమావేశాల్లో మాట్లాడుతున్న ‌ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here