నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల ఆస్తులను ఆక్రమించేందుకు ప్రయత్నించే అక్రమార్కులను చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు జనంకోసం ఎల్లప్పుడూ ముందుంటుందని సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి కేంద్రంగా జనంకోసం స్వచ్చంద సంస్థను స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం జనంకోసం సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర రెడ్డి మాట్లాడుతూ అనేక ప్రజా సమస్యలపైన పోరాడి విజయం సాధించి, రంగారెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు గుర్తు చేశారు. జనంకోసం పోరాటాలతో అక్రమార్జన కోల్పోయిన బిల్డర్లు, రాజకీయ నాయకులు తనపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు సంస్థ సభ్యులను విచారణ పేరుతో వేధించడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నామన్నారు. అక్రమ దారుల్లో ప్రభుత్వ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించే వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు జనంకోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు పగడాల వేణుగోపాల్, ఎన్.రాజశేఖర్, జి.త్రినాథ్,, హరిప్రియ తిరునగరి, నందనం విష్ణుదత్ తదితరులు పాల్గొన్నారు.