నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురి కాకుండా నాలా పూడికతీత పనులను వేగవంతం చేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం మదీనాగూడ ప్రధానరహదారిపై గల నాలా పూడికతీత పనులను జగదీశ్వర్‌గౌడ్ జోనల్ కమీషనర్ రవికిరణ్, చందానగర్ సర్కిల్ ఈఈ శ్రీకాంతి, డిఈ సురేష్, ఏఈ ధీరజ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ అధిక వర్షాలు కురిసిన కాలంలో వరదనీరు ఉప్పొంగి లోతట్లు ప్రాంతాల్లో ఉండే కాలనీలు, బస్తీలు మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యగా వరద నీరు సాఫీగా ప్రవహించేలా నాలాల్లో పేరుకున్న చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు హరీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
