దోస్తు కోసం వచ్చామని చెప్పి దోచుకెళ్లారు

నమస్తే శేరిలింగంపల్లి: స్నేహితుడి కోసం వచ్చామని ఇంటిలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఓ వ్యక్తిపై దాడి చేసి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నగదును దోచుకెళ్లారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఎస్ఐ అహ్మద్ పాషా మీడియా కు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన మావిళ్ళపల్లి శ్రీ హర్ష, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తన స్నేహితుడు సాయిరామ్ ప్రసాద్ తో కలిసి చందానగర్ ఇంజనీరింగ్ ఎంక్లేవ్ లో గత 4 నెలలుగా నివాసం ఉంటున్నాడు. శ్రీ హర్ష సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండగా, సాయిరామ్ సోలార్ టెక్నికల్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు.

కాగా ఈ నెల 29వ తేదీన సాయిరామ్ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వీరి నివాసానికి వచ్చి సాయిరామ్ కోసం వచ్చామని శ్రీ హర్షతో తెలిపారు. అరగంటలో వస్తాడని వేచి ఉండమని శ్రీ హర్ష తెలుపగా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. త్రాగడానికి నీళ్లు  కావాలని ఓ వ్యక్తి అడగడంతో శ్రీ హర్ష వంటగది లోకి వెళ్ళగానే వెనక నుండి వచ్చిన మరో వ్యక్తి శ్రీ హర్ష తలను గోడకేసి బాదాడు. శ్రీ హర్ష క్రింద పడిపోగానే స్టోర్ రూమ్ లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు పెట్టి కుర్చీలో తాళ్లతో కట్టి వేశారు. ఇంట్లో ఉన్న రెండు సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ తో పాటు రూ.3500 నగదు ఏటీఎం కార్డు తీసుకుని వెళ్లిపోయారు. ఘటన అనంతరం శ్రీ హర్ష చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ నెల 16వ తేదీన శ్రీ హర్ష అదే కాలనీలో ఉండే సౌరబ్ గౌడ్ అనే వ్యక్తితో వాగ్వాదం జరగడంతో దోపిడీ వెనక సౌరబ్ హస్తం ఉందని శ్రీ హర్ష కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here