భారీ ఊరేగింపుతో మియాపూర్, చందానగర్ డివిజన్లలో బీజేపీ రోడ్ షో

మియాపూర్, చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబ పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, శేరిలింగంపల్లి బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం మియాపూర్, చందానగర్ డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పార్టీ అభ్యర్థులు కె.రాఘవేందర్ రావు, కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డిలతో కలిసి రోడ్ షో లో ఆయన పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ జెపి నగర్ లో బిజెపి నూతన పార్టీ కార్యాలయాన్నీ అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన అక్బరుద్దీన్ తో జత కట్టి కెసిఆర్ హిందువులకు ద్రోహం చేస్తున్నాడన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే హైదరాబాద్ మేయర్ ఎంఐఎం నాయకుడవుతాడని తెలిపారు. నగర ప్రథమ పౌరుడిగా మజ్లీస్ నేతను కోరుకుంటారో, మార్పు తీసుకువచ్చే బీజేపీ నాయకులను ఎన్నుకుంటారో ప్రజలు తేల్చుకోవాలని తెలిపారు.

జిహెచ్ఎంసి ఎన్నికలు మార్చిలో జరగాల్సి ఉండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి భయంతో హడావిడిగా డిసెంబర్ లోనే నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇంతకాలం మొహం చాటేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు మీడియా ముందుకు వచ్చి నీళ్లు, కరెంట్ ఉచితంగా ఇస్తామంటూ చేస్తున్న హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.

శేరిలింగంపల్లి పది డివిజన్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి నియోజకవర్గాన్ని కాషాయమయం చేయాలని కోరారు. రోడ్ షో లో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమం లో శేరిలింగంపల్లి నాయకులు ఎం.రవికుమార్ యాదవ్, మొవ్వ సత్యనారాయణ, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, కాలివేముల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
