నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వరాలయంలో 26వ షడ్వింశ బ్రహ్మోత్సవాలు రెండో రోజు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం 7.30గంటలకు స్వామి వారికి నిత్యోపాసనం, ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు ఉత్సవాస్తస్నపనం, 10.30 గంటలకు జగత్ కళ్యాణ నిమిత్తం స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.

రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో గోదాదేవి పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి భక్తులకు కనువిందు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి ఆచార్యుల పర్యవేక్షణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించారు.
