నమస్తే శేరిలింగంపల్లి: పుట్టుకతో వచ్చే డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా వ్యాధితో బాధపడుతున్న పసికందు ప్రాణాలను కాపాడేందుకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి ముందుకువచ్చారు. పసికందు ఆపరేషన్ నిమిత్తం ఖర్చులకు తక్షణమే తనవంతుగా ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ కు చెందిన హన్మండ్ల రాజేష్ కుమార్ కూతురు కరిష్మా అరుదైన Congenital diaphragmatic hernia వ్యాధితో బాధపడుతూ కూకట్ పల్లి లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేయడానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు వైద్య ఖర్చుల కోసం కెట్టో అనే గ్లోబల్ వెబ్సైట్ ద్వారా ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. సంఘ సేవకులు, సైక్లిస్ట్ గడీల ప్రవీణ్ కుమార్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న లోక్ సభ సభ్యులు డా. జి.రంజిత్ రెడ్డి తక్షణమే స్పందించి తనకు తోచినంత ఆర్థిక సహాయం అందించారు. సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులతో ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడి పాపకు మెరుగైన శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని సూచించారు. తక్షణమే స్పందించి తమ పాప వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీ రంజిత్ రెడ్డికి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.