నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వెంకటేశ్వరాలయ సముదాయం రజతోత్సవాలు నాల్గవ రోజు కన్నుల పండువగా జరిగాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరపీఠాధీశులు శ్రీ స్వాత్మానందేంద్ర స్వామిల పర్యవేక్షణలో శనివారం పురస్కరించుకుని శ్రీవారికి పూర్ణాభిషేకం, శ్రీ వరాహస్వామికి జాలాధివాసం, నవగ్రహ పంచాయతన చతుర్యుగ దేవతా సహిత చండీహోమము, పంచశయ్యాధివాసం, చతుర్వేద స్వస్థి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తరించారు.
స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా దాతలకు సత్కారం…
వైభవోత్సవాల నిర్వహణకు తమవంతుగా సహాయ సహకారాలు అందించి, ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నదాతలను శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఐతే ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ చందానగర్ పరిసర ప్రాంతాల భక్తులు నిస్వార్ధంగా తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉత్సవాల నిర్వహణకు సహకరించడం పట్ల దాతలను ఆయన ప్రత్యేకంగా అభినంది ఆశీర్వదించారు.
స్వామీజీ మాటలకు బావోద్వేగానికి గురైన సాయి పంతులు…
దాతలకు విశ్వాసం కల్పించి చందానగర్ దేవాలయ అభివృద్ధిలో, ఉత్సవాల నిర్వహణలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యులు పోషిస్తున్న పాత్ర ఎవరు మరిచిపోలేనిదని అన్నారు. స్వరూపానందేంద్ర మహాస్వామికి వారు అత్యంత విశ్వాస పాత్రులని, తనకంటే(స్వాత్మానందేంద్ర) మిక్కిలి సుదర్శనం సత్యసాయిని మహాస్వామి ఇష్టపడతారని అన్నారు. దీంతో సాయి పంతులు ఒక్కసారిగా బావోద్వేగానికి లోనయ్యి, కన్నీటి పర్యంతమయ్యారు.
ఉత్సవాల్లో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్…
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అదేవిధంగా బిజెపి ఓబీసీ మోర్చ జాతీయాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌లు వైభవోత్సవాలలో పాల్గొని హరిహరులను దర్శించుకున్నారు. అనంతరం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరపీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామిల ఆశీర్వాదం తీసుకున్నారు.