నమస్తే శేరిలింగంపల్లి: సమానత్వానికి ప్రతీకగా భాగ్యనగరంలో వెలిసిన సమతా మూర్తి చెంతన ఓ మహమ్మదీయ భక్తుడికి ఇద్దరు ప్రముఖ స్వామీజీల ఆశీస్సులు లభించాయి. ముచ్చింతల్ రామనగరంలోని సమతా మూర్తిని ప్రముఖ యోగా గురువు స్వామీ రాందేవ్ బాబా శుక్రవారం దర్శించుకున్న విషయం విధితమే. కాగా అదే సమయంలో మదీనగూడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ యూసుఫ్ సైతం భారీ రామానుజ జీయర్ విగ్రహాన్ని, అక్కడి 108 వైష్ణవ సాంప్రదాయ దివ్యక్షేత్రాలని దర్శించుకున్నారు. ఈ క్రమంలో పతంజలీ యోగా సమితి సభ్యులు యూసుఫ్ ను రాందేవ్ బాబాతో పాటు క్షేత్ర నిర్వాహకులు చిన జీయర్ స్వామీజీలకు పరిచయం చేశారు.

స్వామీజీలు ఇరువురు యూసుఫ్ ను ఆశీర్వదించగా, తనతో పాటు తమ పాఠశాల విద్యార్థులకు ఆశీస్సులు అందించాలని యూసుఫ్ వేడుకున్నారు. కాగా యూసుఫ్ మాటకు స్వామీజీలు మంత్ర ముగ్ధులయ్యారు. తమ కుటుంబంతో సమానంగా ఇతరులకు ప్రేమ ఆప్యాయతలను పంచడమే రామానుజుడి సిద్ధాంతమని, ఆ మార్గంలో పయనిస్తున్న సయ్యద్ యూసుఫ్ లాంటి వారిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు సమతా మూర్తిని దర్శించుకోవడం అభినందనీయమని అన్నారు.
