నమస్తే శేరిలింగంపల్లి: నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను పెద్ద మొత్తంలో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిఖ్ నగర్ రోడ్డు నంబర్ 1 లోని కుమావత్ నాథూరాం ఇంట్లో ప్రదీప్ పటేల్, మహ్మద్ మునీర్ నివాసం ఉంటున్నారు. ఇదే ఇంటి నుంచి గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఇంట్లో తనిఖీ చేయగా బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని రెండు రూముల తాళాలు పగలగొట్టి చూడగా గుట్కా పదార్థాలు, పొగాకు ఉత్పత్తులు పెద్ద మొత్తంలో బయట పడ్డాయి. 41 పాలిథిన్ సంచులు, 6 చిన్న పాలిథిన్ సంచులు, 18 కాటన్ బాక్స్ లు, రెండు సగం సంచుల గుట్కా, పొగాకు ప్యాకెట్లతో పాటు వీటిని తరలించేందుకు వాడుతున్న టీఎస్ 07యూఎల్ 2406 నంబర్ గల టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. ప్రదీప్ పటేల్, మహమ్మద్ మునీర్ తో పాటు కస్టమర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తూ పొగాకు, గుట్కాలను విక్రయిస్తున్న కుమావత్ నాథూరాం ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.