నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ దీప్తి శ్రీ నగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలోని శ్రీ విజయ దుర్గాదేవి 35 వ వార్షిక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనము, పంచగవ్య ప్రాశన, ద్వజారోహణము, ఉదయం 9 గంటలకు పంచామృత అష్టోత్తర శతకలశ ఘట్టాభిషేకము నిర్వహించారు. మద్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనము, అన్నదాన ప్రసాద వితరణ జరిగాయి.
సాయంత్రం 4 గంటలకు దుర్గా హోమము, 6 గంటలకు సహస్ర నామార్చన, మహా మంగళ హారతులు, పల్లకీసేవ, రాజోపచారములు, తీర్థప్రసాద వితరణ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఒగ్గుడోలు బృందం విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కోలాటం బృందం భక్తిగీతాలను ఆలపిస్తు, అందుకు అనుగుణంగా ఆటలు ఆడుతూ సందడి చేశారు. చుట్టు పక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.