నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో 9వ రోజు లక్షదీపోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం జ్వాలాతోరణం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక నాట్యం డ్యాన్స్‌స్కూల్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం శ్రీ గణేశాయ నమః గేయానికి అనుగుణంగా చేసిన సాంప్రదాయ నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణ మూర్తి జ్వాలాతోరణాలను వెలిగించారు. అనంతరం స్వామివారి పల్లకిని పురవీధుల్లో ఊరేగించారు.
ప్రధానార్చకులు వేదుల పవన్‌కుమార్‌శర్మ, మురళీధర శర్మల బృందం పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, వాస్తు సిద్ధాంతి ప్రసాద్ శర్మ, శిల్ప ఎన్క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని పదివేల దీపాలు వెలిగించారు. అటు దీపాలు, ఇటు జ్వాలాతోరణ కాంతుల్లో శిల్పా ఎన్క్లేవ్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.