నమస్తే శేరిలింగంపల్లి: అజ్ఞానం అనే ఊబిలోకి కూరుకుపోకుండా మంచి జ్ఞానాన్ని అందించి పైకి తీసుకొచ్చేవారే గురువులని భారతీయం సత్యవాణీ అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమి నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైనట్లు ధర్మపురి క్షేత్రం నిర్వాహకులు భారతీయం సత్యవాణీ తెలిపారు. ఈ సందర్భంగా గురుతత్వం పై మాట్లాడారు.
అజ్ణానాందకారం నుండి జ్ఞాన మార్గం వైపు నడిపించేది ఒక్క గురువుతోనే సాధ్యమన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువును దైవ సమానులుగా కొలుస్తామని అన్నారు. వ్యాస మహర్షి పుట్టిన రోజును గురు పౌర్ణమిగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. నిజమైన గురువు బోధనలు చేసేవాడు కాదని, మెలుకవ తెప్పించేవాడన్నారు. గురువు తన స్థితిని శిష్యునికి ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడన్నారు. గురువు గొప్పతనం ఎన్నటికీ మరవలేనిదని భారతీయం సత్యవాణీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.