కరోనా విపత్కర కాలం నా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం: సోనూసూద్

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కాలంలో తాను చేసిన పనులు తన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టమని, వాటినెప్పటికీ మరచిపోలేనని సినీ నటుడు సోనూసూద్ అన్నారు. బుధవారం గచ్చిబౌలి లోని సంధ్య కన్వెన్షన్ హాలులో సైబరాబాద్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబర్ సెక్యురిటి కౌన్సిల్ ల సంయుక్త ఆధ్వర్యంలో కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోనూసూద్ తో పాటు సింగర్ స్మిత, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో పాటు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ హాజరయ్యారు.

కార్యక్రమంలో సినీనటుడు సోనూసూద్ తో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తదితరులు

ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ తాను సామాజిక బాధ్యతగా కొందరికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చానని, అనంతరం సహాయం కోసం ఎదురుచూసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వచ్చిందన్నారు. వీలైనంత మందికి సహాయం చేసేందుకు తమ సేవ కార్యక్రమాలను మరింతగా విస్తరించామని తెలిపారు. తమ ప్రయాణంలో దాదాపు 7.26 లక్షల మంది కలిసి వచ్చారని, విదేశాల నుండి 3500 పైగా విద్యార్థులను తమ స్వస్థలాలకు చేర్చగలిగామని తెలిపారు. తర్వాత తమకు ఉద్యోగాలు కల్పించాలని పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయని, కొన్ని కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగ సేవలు అందించే సంస్థల సహకారంతో నేటికి 2 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ కరోనా కాలంలో ఎంతో మంది మనవాతా వాదులను కలిశానని తెలిపారు. ముందుగా తాము 3 లక్షల మంది వలస కూలీలను 40 రైళ్లలో తమ స్వస్థలాలకు చేర్చామని తెలిపారు. ప్రజల సమస్యలు పరిక్షారించేందుకు దేశంలోనే తొలిసారిగా కరోనా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రతీరోజూ 3000 మందికి కావలసిన సమాచారాన్ని అందించామని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 8000 మంది కరోనా రోగులకు ప్లాస్మా అందజేయగలిగామని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మానవతా హృదయంతో సేవలందించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్ సోనూసూద్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్సి కార్యదర్శి కృష్ణ ఎదులతో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here