- గచ్చిబౌలిలో సైబరాబాద్ ట్రాఫిక్ వార్షిక సదస్సు
- ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: జూనియర్ ఎన్టీఆర్
సైబరాబాద్(నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో గత మూడేళ్ల కాలంలో రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గుముఖం పట్టాయని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమీషనర్ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ వార్షిక సదస్సును బుధవారం గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, రైల్వేస్ మరియు రోడ్డు భద్రత అడిషనల్ డిజిపి సందీప్ శాండిల్యలు హాజరై కమీషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జనార్ గత సంవత్సరం రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించారు.
ఇతర ప్రాంతాల నుండి సైబరాబాద్ కు వచ్చే వారికి కమీషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన నియమాలు తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించామని తెలిపారు. కొత్త కూడళ్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. రోడ్ ఇంజనీరింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి వాహనదారులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసకున్నామని తెలిపారు. ప్రతీ రోడ్డు ప్రమాదం కేసులో ఒక ఎస్సై స్థాయిపోలీసు అధికారితో దర్యాప్తు చేయించడంతో పాటు హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన ఛేదించగలుగుతున్నామన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు సైబరాబాద్ పోలీసులు అందించిన సేవలు వెలకట్టలేవని అన్నారు. దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు మంచి ఫలితాలు సాధించారన్నారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇతరులు చేసిన పొరపాట్ల కారణంగా తన తండ్రి, అన్నను రోడ్డు ప్రమాదంలో కోల్పోవలసి వచ్చిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో అమాయక కుటుంబాలు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో తమ కోసం ఇంటివద్ద ఎదురుచూసే కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపేదే పోలీసు వ్యవస్థ అని, పోలీసులను గౌరవించడం ప్రతీ పౌరుడి బాధ్యతగా భావించాలన్నారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ, నియమాలపై అవగాహన కలిగించేలా హస్యనటులు చేసిన స్కిట్‌లు అలరించాయి. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణలో సహకరించిన పౌరులతో పాటు అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సదస్సులో కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎం విజయ్ కుమార్, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, బాలనగర్ జోన్ డిసిపి పద్మజా రెడ్డి, రాజేందర్ నగర్ డిసిపి ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ డిసిపి అనసూయలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.