నమస్తే శేరిలింగంపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన జి.నాగచైతన్య(25) నల్లగండ్ల సిటిజన్ హాస్పిటల్ ఆంకాలజీ విభాగంలో నర్సుగా పనిచేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన కోటిరెడ్డి మెడికల్ రిప్రజెంటేటీవ్‌గా పనిచేస్తున్నాడు. విదినిర్వహణలో భాగంగా తరచూ సిటిజన్ హాస్పిటల్‌కు వచ్చే కోటిరెడ్డితో నాగచైతన్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురు పెళ్లిచేసుకందామని నిర్ణయించుకున్నారు. కాగా వారి పెద్దలు పెళ్లికి నిరాకరించారు. ఐతే శనివారం నల్లగండ్ల ప్రాంతంలోని ఓయో రూంలో ఇరువురు కలసి రూం తీసుకున్నారు. ఆదివారం రాత్రి వరకు వారి గది తలుపులు తెరుచుకోక పోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు తెరిచి చూడగా నాగచైతన్య రక్తపు మడుగులో పడి ఉంది. కోటిరెడ్డి మాత్రం కనిపించలేదు. దీంతో చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నర్సు నాగచైతన్య మృతి పట్ల అనుమానాలు…
నల్లగండ్లలోని ఓయో రూం నుండి అదృశ్యమైన కోటిరెడ్డి సోమవారం ఒంగోలులో ప్రత్యక్షమయ్యాడు. పొట్టలో, గొంతు వద్ద కత్తి గాట్లతో స్థానిక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్టు అక్కడి పోలీసులు గుర్తించారు. తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించామని కోటిరెడ్డి పోలీసులకు తెలిపాడు. కాగా నాగచైతన్య మృతిపట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరువురు ఆత్మహత్యకు ప్రయత్నించగా నాగచైతన్య మాత్రమే మృతిచెందడం, ఒంటిపై కత్తి గాట్లతో కోటిరెడ్డి ఒంగోలులో ప్రత్యేక్షమవ్వడం పలు అనుమానాలకు దారితీస్తుంది. నాగచైతన్య నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక కోటిరెడ్డి ఆమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడా అనే కోణంలోను పోలీసులు విచారణ చేస్తున్నారు.