నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్‌లోని హైటెక్స్‌లో టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ప్లీనరి వేడుక విజయవంతంగా ముగిసింది. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పార్టీ శ్రేణులు 9వ సారి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చిన గాంధీ వాటిని వెనక్కు కూడా తీసుకున్నారని, 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైనా స్వాతంత్ర్య పోరాటం మాత్రం ఆగలేదని ఆ పంథాలోనే తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోని కొన్ని జిల్లాల నుంచి టీఆర్ఎస్ పార్టీని అక్కడ సైతం విస్తరించాలని విజ్ఞప్తులు వస్తున్నట్టు తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వ విప్ గాంధీ, స్థానిక కార్పొరేటర్ల సందడి…
ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యుడైన శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డితో కలసి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌తో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ప్లీనరీ వేదిక వద్ద సందడి చేశారు. తన డివిజన్‌లో జరుగుతున్న ప్లీనరీ నేపథ్యంలో కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. పార్కింగ్ వద్ద నిర్వహణ భాద్యతలు, అదేవిధంగా డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలసి భోజనం పంపిణీ వద్ద సేవలందించారు. మిగిలిన కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్లీనరీలో పాల్గొన్నారు.