నమస్తే శేరిలింగంపల్లి: వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే రోడ్డు ప్రమాదానికి గురై నవ వరుడు మృతి చెందగా, వధువు కోమాలోకి వెళ్లింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకోగా మృతుడి నివాస ప్రాంతమైన శేరిలింగంపల్లిలో విషాద చాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్‌కు చెందిన పార్శి మురళీకృష్ణ, అన్నపూర్ణ దంపతుల కుటుంబం శేరిలింగంపల్లికి వలస వచ్చారు. గతంలో శాంతీనగర్‌లో కిరాణ షాపు నడిపిన మురళీకృష్ణ ఇటీవల గుల్‌మోహర్‌పార్కు నేతాజీ నగర్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. వారికి శ్రీనివాసులు, నవీన్ అని ఇరువురు కుమారులు సంతానం. ఐతే శ్రీనివాసుసులు బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న కనిమొళి అనే యువతితో శ్రీనివాసులుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారగా అందుకు పెద్దలు సైతం అంగీకరించారు.
సమీప బంధువుల సమక్షంలో ఈ నెల 21న తిరుమలలో శ్రీనివాసులు కనిమొళీలు వివాహం చేసుకున్నారు. అదేరోజు రాత్రి నవ దంపతులు చైన్నైలోని వధువు నివాసానికి బయలుదేరారు. శ్రీనివాసులు స్వయంగా కారు నడుపగా కనిమొళితో పాటు ఆమె సోదరి, మరో ఇద్దరు మహిళలు చైన్నైకి ప్రయాణమయ్యారు. 22 తెల్లవారు జామున తమిళనాడులోని కృష్ణగిరి హాస్పిటల్ ముందు ఆగి ఉన్న లారీకి శ్రీనివాసులు కారు ఢీకొట్టింది. అతివేగంగా ఉన్న కారు ప్రమాద దాటికి తుక్కు అయ్యింది. ఈ క్రమంలో ముందు వైపు కూర్చున్న నవ వరుడు శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా, వధువు కనిమొళి కోమాలోకి వెళ్లిపోయింది. వెనకాల కూర్చున్న వారు సైతం తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. వివాహం జరిగి 24 గంటలు గడవక ముందే వరుడు మృతి చెందగా, వధువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటం స్థానికులను కలచివేసింది. కాగా శ్రీనివాసులు మృతదేహాన్ని శేరిలింగంపల్లిలోని తరలించగా బుదవారం లింగంపల్లి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.