- కేసును చేధించిన రాయదుర్గం పోలీసులను అభినందించిన సీపీ సజ్జనార్
నమస్తే శేరిలింగంపల్లి: నకిలీ షాపింగ్ వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్లను ఆశచూపి జనాలను బురిడీ కొట్టించాడు ఓ వెబ్ డెవలపర్. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేయగా రాయదుర్గం పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమీషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమీషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిషబ్ ఉపాధ్యాయ్ అలియాస్ చందన్(30) వారణాసిలో బిఎస్సీ పూర్తి చేశాడు. అనంతరం బెంగళూరులో ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌లో ఎంబిఎ పూర్తి చేసి హాస్టల్‌లో నివాసం ఉంటూ కాల్‌సెంటర్‌లో కొంతకాలం పనిచేశాడు. అనంతరం వెబ్ డిజైనింగ్ నేర్చుకుని అందులో నైపుణ్యం సంపాదించాడు. ఈ క్రమంలో www.freelancer.co, www.upwork.com వెబ్‌సైట్లను తయారు చేసి వెబ్‌డెవలపింగ్ ప్రాజెక్టులు చేయడం మొదలుపెట్టాడు. మూడేళ్లక్రితం అమెరికా నుండి ప్రిన్స్ అనే వ్యక్తి www.jobfinder.info పేరిట ఓ వెబ్‌సైట్ రిషబ్ చేత చేయించుకున్నాడు. కొద్దికాలం తరువాత తాను తయారు చేసిన వెబ్‌సైట్ నకిలీదని, అందులో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి నుండి ఒక డాలర్ చొప్పున ప్రిన్స్ పెద్దమొత్తంలో సంపాదించాడనే విషయాన్ని రిషబ్ గ్రహించాడు. దీంతో రిషబ్ కు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చి ఫ్రీలాన్సర్ సైట్ ద్వారా నిరుద్యోగులకు గాలం వేసి వారిని మోసగించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే రిషబ్ డిజిటల్ మార్కెటింగ్‌లో నిపుణుడైన పంజాబ్ వాసి రాహుల్‌తో పరిచయం చేసుకుని తన కార్యాచరణలో భాగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే www.deckup.com పేరిట ఓ నకిలీ ఫర్నీచర్ మార్కెటంగ్ వెబ్‌సైటును ప్రారంభించి వినియోగదారుల నుండి ఆర్డర్లు తీసుకుంటూ దాదాపు రూ.20లక్షల వరకూ పేమెంట్లు చేయించాడు. అందులో రూ.28 వేలు విత్‌డ్రా చేయగా మిగిలిన సొమ్మును ప్రజల ఫిర్యాదుల కారణంగా పేమెంట్ గేట్‌వే సంస్థ రాజోర్ పే బ్లాక్ చేసింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో www.zopnow.com పేరిట గ్రాసరీ వెబ్‌సైటుతో పాటు www.modwayfurniture.in పేరిట ఫర్నీచర్ వెబ్‌సైటును రూపొందించి రాహుల్ సహాయంతో వెబ్‌సైట్లకు ఆదరణ వచ్చేలా చేయించాడు. అంతకుముందే సేకరించిన ఇతరుల కెవైసి వివరాల సహాయంతో పలు బ్యాంకులలో ఖాతాలను తెరిచి వెబ్‌సైట్లలో వచ్చే ఆర్డర్ల సొమ్ము తమ ఖాతాల్లో జమ అయ్యేలా చేశాడు. దేశవ్యాప్తంగా రెండు సైట్లపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు నిర్వాహకులపై నిఘా ఉంచారు. ఏప్రిల్ 28వ తేదీన ఖాజాగూడకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జాప్‌నవ్ సైటులో తాను పెట్టిన ఆర్డర్ రాలేదని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులు బెంగళూరులో ఉన్న రిషబ్ ఉపాధ్యాయ్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు, 20 డెబిట్ కార్డులు, 6 బ్యాంకు పాస్‌బుక్‌లతో పాటు రూ. 40 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా రాహుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి, డిఐ నవీన్‌రెడ్డి, ఎస్ఐ నర్సింహరావులను కమీషనర్ అభినందించారు. ఈ సమావేశంలో డిసిపి క్రైమ్స్ విజయ్‌కుమార్, ఎసిపి బాలక్రిష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.