గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ఓ వ్యక్తి భారీ హైడ్రా వాహనాన్ని రహదారిపైకి తీసుకువచ్చి నిర్లక్ష్యంగా నడిపించాడు. ఈ క్రమంలో ఆ వాహనం అదుపుతప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలకు గురై మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మహాసముద్రం ప్రాంతానికి చెందిన కె.శివకుమార్ (34) నగరంలో ఓ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 28వ తేదీన సాయంత్రం 5.50 గంటలకు అతను గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైంట్ జంక్షన్ వద్ద తన ద్విచక్రవాహనం (ఏపీ16ఎఫ్ 4816)పై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉండగా వెనుక నుంచి వచ్చిన ఓ హైడ్రా భారీ వాహనం (ఓఆర్ 0437908) అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో శివకుమార్‌కు తీవ్రగాయాలు కాగా చుట్టు పక్కల ఉన్నవారు అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. కాగా అప్పటికే శివకుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో శివకుమార్ కు తెలిసిన వ్యక్తి అయిన మూసాపేట ప్రగతినగర్ లో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగి యువరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ హైడ్రా వాహనం భారీ వాహనం అయినందున పగటి పూట సిటీలోకి ఆ వాహనానికి అనుమతి లేదని, ఆ విషయం తెలిసినప్పటికీ వాహన డ్రైవర్ ఆ వాహనాన్ని సిటీలోకి తీసుకువచ్చాడని, దీనికితోడు ఆ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపించడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్ పై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.