మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): వైన్ షాపు నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అస్సాంకు చెందిన ఇనాముల్ హక్ (33) బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి మాదాపూర్ లోని సిద్దిక్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇనాముల్ హక్ మద్యం కోసం కొత్తగూడలోని ఆర్ఆర్‌జీ వైన్ షాపు వద్దకు వచ్చాడు. అదే సమయంలో షాప్ కు చెందిన సజ్జ, బోర్డు కూలాయి. ఈ ఘటనలో ఇనాముల్ హక్ తీవ్ర గాయాలకు గురయ్యాడు. దీంతో అతన్ని వెంటనే సమీపంలో ఉన్న కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ మేరకు సదరు వైన్ షాపు యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
