మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భార్యపై కత్తితో దాడి చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాదాపూర్‌లోని సిద్దిక్‌నగర్‌లో మంగళవారం ఉదయం 5.30 గంటలకు లక్ష్మి అనే మహిళపై ఆమె భర్త మురళి కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన లక్ష్మిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై హత్యాయత్నం, వేధింపుల కేసు నమోదు చేశారు. కాగా మురళి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందం ద్వారా గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

