శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): భార్యతో గొడవపడిన ఓ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యం అయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా చిట్యాల్‌కు చెందిన కందికొండ దుర్గా ప్రసాద్ (42) భార్య కందికొండ లక్ష్మి, పిల్లలతో కలిసి గత కొంత కాలం కిందట బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి చందానగర్‌లోని వెంకట్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా జూన్ 20వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో దుర్గా ప్రసాద్ ఎవరితోనో ఫోన్‌లో చాటింగ్ చేస్తున్నాడని చెప్పి భార్య లక్ష్మి అతనితో గొడవ పడింది. తరువాత రోజు ఆమె పని ఉందని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు అంటే జూన్ 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు వచ్చి చూడగా భర్త కనిపించలేదు. తండ్రి ఏమయ్యాడని తన పిల్లల్ని అడగ్గా తాము ఉదయం నిద్ర లేచే సరికి అతను ఇంట్లో లేడని, బయటకు వెళ్లిపోయాడని వారు చెప్పారు. దీంతో దుర్గా ప్రసాద్ ఆచూకీ కోసం లక్ష్మి చుట్టు పక్కల, తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద విచారించింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా దుర్గా ప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు బ్లూ కలర్ షర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నాడని, అతని ఎత్తు సుమారుగా 5 అడుగుల 5 అంగుళాలు ఉంటుందని, తెలుగు, హిందీ భాషలు మాట్లాడగలడని, ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.