నమస్తే శేరిలింగంపల్లి: మద్యానికి బానిసై ఇంట్లో తరచూ భార్యతో గొడవ పడుతూ ఓ వృద్ధుడు మద్యం మత్తులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ రాజీవ్ గృహకల్పలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమ్ము శివ(55), కొమ్ము అచ్చమ్మ భార్యభర్తలు కూలీ పనులు చేసుకుంటూ పాపిరెడ్డి నగర్ లోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ నం 58/7 లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన శివ ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ నెల 30 న రాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వెళ్లిన శివ టీ పెట్టమని కోరడంతో పాల కోసం భార్య అచ్చమ్మ దుకాణానికి వెళ్లి వచ్చి చూసే సరికి కేబుల్ సహాయంతో ఉరేసుకుని కనిపించాడు. హుటాహుటిన ఇరుగుపొరుగు వారి సహాయంతో కిందకు దించడంతో అప్పటికే భర్త శివ మృతి చెందాడు. మృతుని భార్య అచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.