- సందర్శిని హోటల్ లో పనిచేస్తున్న దేవేందర్
- ప్రేమ వ్యవహారమే కారణం..?
నమస్తే శేరిలింగంపల్లి: మదీనగూడలో కాల్పుల కలకలం రేగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒక వ్యక్తి తూటాలకు బాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదీనాగూడ సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్ (35) విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్ గాయన్ ను హోటల్ సిబ్బంది హుటాహుటిన దగ్గరలోని అర్చన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవేందర్ మృతి చెందారు.

కోల్ కతాకు చెందిన దేవేందర్ గాయాన్ గత ఆరు నెలల క్రితమే సందర్శిని హోటల్ లో మేనేజర్ గా పనిలో చేరాడు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ గోనె సందీప్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి కంట్రీ మేడ్ పిస్తోల్ తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడని, గాయాలపాలైన దేవేందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు టీమ్ లు రంగంలోకి దిగాయని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. అయితే ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ప్రేమ వ్యవహారమే కారణమని, సందర్శిని హోటల్ లో పనిచేస్తున్న అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం.