మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని ఓల్డ్ హఫీజ్‌పేట సాయినగర్‌లో నివాసం ఉండే మహమ్మద్ సిరాజుద్దీన్ స్థానికంగా మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కాగా అతని కుమార్తె మెహెక్ (11) తమ స్వగ్రామంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెను స్వగ్రామం నుంచి ఆమె తల్లి మంగళవారం సాయినగర్ కు తీసుకువచ్చింది. కాగా తనకు సాయినగర్‌లో ఉండడం ఇష్టం లేదని చెప్పిన మెహెక్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమె కోసం కుటుంబ సభ్యులు అంతటా గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మెహెక్ ఎత్తు సుమారుగా 4 అడుగుల 8 అంగుళాలు ఉంటుందని, ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లినప్పుడు నలుపు రంగు ఫ్రాక్, తెల్లని పూలు ధరించి ఉందని ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని మియాపూర్ పోలీసులు తెలిపారు.