- రూ.30 లక్షల నిధి సమర్పించిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్
- రవికుమార్ యాదవ్ నేతృత్వంలో దాదాపు రూూ. 2 కోట్ల నిధి సేకరణ
నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణానికి శేరిలింగంపల్లి బిజెపి నాయకులు పెద్దమొత్తంలో నిధి సమర్పణ చేశారు. నియోజకవర్గ నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ అభియాన్ కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సీతా రామచంద్రులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిధి సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ, నిజామబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లు హాజరయ్యారు. మాజీ శాసనసభ్యులు ఎం.భిక్షపతియదవ్ రూ.30 లక్షల రూపాయలను క్షేత్ర నిధికి అందజేశారు. దీంతోపాటు నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు, రామ భక్తులు నిధి సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ రామ జన్మభూమిలో మందిర నిర్మాణములో పాల్గొనేందుకు జీవితంలో ఒకేసారి లభించే సువర్ణ అవకాశం మన ముందు ఉందన్నారు. ఈ పవిత్ర కార్యంలో రామ భక్తులంతా పాల్గొని విరివిగా నిధి సేకరణ చేపట్టాలన్నారు. అనంతరం దేవేందర్ జీ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం హైందవ సమాజం ఐదు శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న కల అని తెలిపారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బిజెపి నాయకులు రామభక్తుల సహకారంతో దాదాపు రూ.2 కోట్ల నిధిని సమీకరించమని తెలిపారు. ఈ మహత్కార్యంలో పాలు పంచుకుని రాముని సేవ చేసుకునే భాగ్యం లభించడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిజెపి నాయకులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు గంగల నర్సింహ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, సమ్మెట ప్రసాద్, గుండె గణేష్ ముదిరాజ్ లతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.