
నమస్తే శేరిలింగంపల్లి: భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ యువతి పట్ల ఆ భార్య విచక్షణారహితంగా వ్యవహరించింది. ఆ యువతిని నలుగురు యువకులతో కలిసి కిడ్నాప్ చేయించడంతో పాటు ఆమెపై దాడికి పాల్పడి నగ్న చిత్రాలు, వీడియోలు తీయించి అత్యాచారయత్నానికి ప్రేరేపించిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీలో నివసించే గాయత్రి భర్త శ్రీకాంత్ సివిల్స్ కు సిద్ధమవుతున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటూ శ్రీకాంత్ తో కలసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతి తన భర్తతో చనువుగా ఉండటాన్ని గాయత్రి తట్టుకోలేక పోయింది. సదరు యువతిపై కక్ష పెంచుకున్న గాయత్రి ఈ నెల 26న తనను ఇంటికి పిలిపించింది. సదరు యువతి తల్లితండ్రులతో కలసి రాగా వారిని బయటే ఉంచి ఆమెను మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లి గడియ పెట్టింది. అప్పటికే తనకు పరిచయమున్న ఐదుగురు యువకులు పృద్వి విష్ణువర్ధన్, ఉర్సల మనోజ్ కుమార్, సయ్యద్ మస్తాన్, షేక్ ముజాహిద్, షేక్ మౌలాలి ఇంట్లోకి పిలిపించిన గాయత్రి వారిని ఆమెను అత్యాచారం చేసేలా పురమాయించింది. ఈ క్రమంలో ఆ ఐదుగురు ఆమెను నిర్బందించి నోటికి ప్లాస్టర్ వేసి, అసభ్యకర చేష్టలకు పాల్పడగా గాయత్రి ఆ తంతును వీడియోలు, చిత్రాలు తీసింది.

వారిపై ఎదురు దాడికి దిగిన బాధితురాలు అక్కడి నుండి తప్పించుకుని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన మహిళ గాయత్రితో పాటు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై నిందితురాలి తల్లి స్పందించారు. గాయత్రి తీరు అలాగే ఉంటుందని, ఈ నెల 26న జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, గాయత్రికి ఇది వరకే పెళ్లి అయిందని, కానీ ఆమె తన భర్తను వదిలి శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి తమ ఇంట్లోనే ఉంటుందని, ఇదేంటని ప్రశ్నించినందుకు తనపై గతంలో దురుసుగా వ్యవహరించిందని, గాయత్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.