నమస్తే శేరిలింగంపల్లి: ముస్లిం సోదరులకు తమ జీవితంలో హజ్ యాత్ర ఎంతో ముఖ్యమని, పవిత్రమైన మక్కా తీర్థయాత్రను ప్రతి ముస్లిం తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సందర్శించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహ్మద్ మసి ఉల్లా ఖాన్ అన్నారు. ఎంతో పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు హాజ్ తర్బీయతి కార్యక్రమాన్ని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో బండ్లగూడలోని సన్ సిటీ దగ్గరలోని జిఅర్ కె గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వక్ఫ్ బోర్టు చైర్మన్ మొహ్మద్ మసి ఉల్లా ఖాన్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ముఫ్తీ సాదిక్ మొయినుద్దీన్, ముఫ్తీ అసిఫ్ అలీ నద్వి, ముఫ్తీ మౌలానా అన్వార్ అహ్మద్, తెలంగాణ హజ్ కమిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇర్ఫాన్ షరీఫ్, తెలంగాణ హజ్ కమిటీ ఖాదీమ్ ఉల్ హుజాజ్ సభ్యులు మొహ్మద్ జాకిర్, మొహ్మద్ అహ్మద్ పాషా, ఆఫీజ్ మొహ్మద్, అభిబ్ హుస్సేన్, హఫీజ్ సయ్యద్ తహర్ హుస్సేన్ హాజరై హజ్ యాత్ర గొప్పతనాన్ని వివరించారు.

అల్లాహ్ ప్రవక్త వాక్యాలను హజ్ భోదించారు. హజ్ యాత్రలో తీసుకోవాల్సిన నియమ నిబంధనలు, క్రమశిక్షణతో చేయాల్సిన ప్రార్ధనల గురించి హజ్ యాత్రికులకు వివరించారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా లాటరీ పద్ధతిలో ఎన్నికైన హజ్ యాత్రికులకు ముందస్తుగా ఇచ్చే హాజ్ తర్బీయతి కార్యక్రమం తమ ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆ అల్లాహ్ దయతో ఈ పవిత్ర యాత్ర చేసే ప్రతి ఒక్క హజ్ యాత్రికునికి శుభాకాంక్షలు తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి కాని, హజ్ యాత్ర చేసి వచ్చిన వారికి కాని స్వాగతమివ్వటం ఎంతో పుణ్యఫలం అని అన్నారు. లబ్భైక్ లబ్భైక్ మే హాజీర్ హూ.. మే హాజీర్ హూ.. అంటూ ఎంతో క్రమశిక్షణతో, సంతోషంతో తమ హజ్ యాత్ర పూర్తి చేసుకొని రావాలని హమీద్ పటేల్ కోరారు. ఈ కార్యక్రమంలో హజ్ యాత్రకు వెళ్లనున్న ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
