నమస్తే శేరిలింగంపల్లి: ద్విచక్ర వాహనాలను క్షణాల్లో మటుమాయం చేయడంలో వారిద్దరూ నిష్ణాతులు… పార్కింగ్ స్థలాల్లో, పబ్లిక్ ప్లేస్ ల్లో ఎక్కడైనా సరే వారి కంటికి కనబడ్డ బైక్ ను దొంగలించడంలో దిట్ట.. బైక్ దొంగతనాలు చేసి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు నేరస్థులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. రాయదుర్గం ఇన్ స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఆసీఫ్ నగర్ కు చెందిన వెంకటేష్, గుడ్డిమల్కాపూర్ కు చెందిన కుమ్మరి నాగేష్ లు కలిసి బైక్ దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అంజయ్య నగర్ లోని యమహా షోరూం పక్కన పార్కింగ్ చేసి ఉన్న డుయో ద్విచక్ర వాహనాన్ని సెప్టెంబర్ 22 వ తేదీన దొంగతనం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు గురువారం వెంకటేష్, నాగేష్ లను అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించిన రూ. 2.5 లక్షల విలువ గల 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ రాజేంద్ర నగర్, బంజారాహిల్స్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, లంగర్ హౌజ్, మంగల్ ఘాట్, శాయినాయత్ గంజ్, తప్పచబుత్ర, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో 2016 నుంచి ద్వి చక్ర వాహనాలను దొంగలించిన కేసులో పలుమార్లు అరెస్టయి జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ అదే పనిని మొదలుపెట్టారు.