- అధిక వడ్డీలకు డబ్బులు అప్పు ఇస్తూ.. చెల్లించకపోతే తీవ్ర వేధింపులు, బెదిరింపులు..
- రెండు కంపెనీలకు చెందిన డైరెక్టర్లు సహా సైబరాబాద్ పోలీసుల అదుపులో ఆరుగురు
- ఆర్బీఐ అనుమతి లేకున్నా లోన్ యాప్‌ల నిర్వహణ
- బ్యాంకేతర సంస్థలతో ఒప్పందాలు.. భారీగా రుణాలు..
- గడువు తేదీ దాటితే వేధింపులు షురూ
- నిందితుల నుంచి కంప్యూటర్లు, సెల్ఫోన్లు స్వాధీనం
- రూ.1.52 కోట్ల నగదు ఉన్న 18 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్
- లోన్ యాప్‌లు వాడే ముందు లైసెన్స్ చెక్ చేసుకోవాలని సీపీ సజ్జనార్ సూచన
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇన్స్టంట్ రుణాల పేరిట యాప్‌ల ద్వారా అధిక మొత్తంలో వడ్డీలకు డబ్బులను అప్పులుగా ఇస్తూ, వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే వారిని తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్న రెండు కంపెనీలకు చెందిన నిర్వాహకులను, పలువురు సిబ్బందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
ఈ నెల 7వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. తాను జనవరి 8, 2020వ తేదీన డబ్బులు అవసరం ఉండి గూగుల్ ప్లే స్టోర్‌లో రుణాలను ఇచ్చే యాప్స్ కోసం వెదికానని, అందులో భాగంగానే క్యాష్ మామా అనే యాప్ కనిపించిందని తెలిపాడు. అందులో ఆధార్, పాన్ వివరాలు, ఫొటో, 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ను అప్లోడ్ చేస్తే 7 రోజుల కాలవ్యవధిలో చెల్లించేలా రూ.5వేల లోన్ ఇచ్చారని, అయితే అందులో జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1180 కట్ చేసి రూ.3820 అప్పుగా ఇచ్చారని తెలిపాడు.
కాగా క్యాష్ మామా యాప్‌లో అలా తాను 6 సార్లు లోన్ తీసుకుని సకాలంలో చెల్లించానని తెలిపాడు. అయితే పలు భిన్న రకాలకు చెందిన ఫోన్ నంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని, హేయ్ ఫిష్, మంకీ క్యాష్, క్యాష్ ఎలిఫెంట్, లోన్ జోన్, క్యాష్ జోన్, వాటర్ ఎలిఫెంట్, మేరా లోన్ తదితర యాప్స్ లో లోన్ తీసుకోవాలని కాల్స్ వచ్చాయని తెలిపాడు. వాటి నుంచి రూ.30వేల వరకు లోన్ తీసుకోగా, కేవలం రూ.20వేలను మాత్రమే లోన్ రూపంలో ఇచ్చారని తెలిపాడు. అయితే సెప్టెంబర్ 12వ తేదీ వరకు మొత్తం రూ.29వేలను చెల్లించానని, అయినప్పటికీ ఇంకా రూ.8,643 చెల్లించాలని సదరు యాప్‌లకు చెందిన ప్రతినిధులు తనకు నిత్యం కాల్ చేసే వారని అన్నాడు. వారు ఆ మొత్తాన్ని చెల్లించాలని కాల్ చేస్తూ తీవ్రమైన వేధింపులకు గురి చేసేవారని, బ్లాక్ మెయిల్ చేసేవారని, భయపెట్టేవారని అన్నాడు. తన కాంటాక్ట్ లిస్ట్‌ను సేకరించి అందులో ఉన్న తన కుటుంబ సభ్యులకు తన గురించి కాల్స్ చేసి చెప్పేవారని, అలాగే వాట్సాప్ ద్వారా అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ వేధించేవారని అన్నాడు.
కాగా వారి వేధింపులను భరించలేక బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఐపీసీ సెక్షన్లు 420, 506, ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ 66, తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్ సెక్షన్లు 3, 10, 13(1)ల ప్రకారం యాప్‌లకు చెందిన కంపెనీలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సదరు యాప్‌లను నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు ఆ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ జంక్షన్ సమీపంలో ఉన్న ఓ భవంతిలోని ఆ కంపెనీలపై ఆకస్మిక దాడులు చేశారు. ఆ దాడుల్లో ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సీఈవో, డైరెక్టర్ కొణతం శరత్ చంద్ర, మరొక డైరెక్టర్ పుష్పలత, క్రెడ్ ఫాక్స్ డైరెక్టర్ బి.వాసవ చైతన్య, లోన్ కలెక్షన్ ఏజెంట్లు బి.వెంకటేష్, సచిన్ దేశ్‌ముఖ్, టీమ్ లీడర్ సయ్యద్ అషిక్ లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 3 డెస్క్ టాప్‌లు, 22 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారికి చెందిన మొత్తం 18 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఆ అకౌంట్లలో మొత్తం రూ.1.52 కోట్ల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా సదరు కంపెనీలకు చెందిన నిర్వాహకులు భిన్న రకాల లోన్ యాప్‌లను క్రియేట్ చేసి వాటిని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంచారు. నిజానికి ఆ యాప్‌లకు ఆర్బీఐ నుంచి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే సదరు యాప్‌ల నిర్వాహకులు ఇతర బ్యాంకేతర ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఈ విధంగా రుణాలను ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి తమదైన సొంత గుర్తింపు ఆర్బీఐ నుంచి లేదని తెలిపారు. ఈ క్రమంలోనే చిన్న మొత్తాల్లో జనాలకు రుణాలను ఇస్తూ వాటికి ఏకంగా 35 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. అయితే రుణాలను సక్రమంగా చెల్లిస్తే ఓకే, లేదంటే లెవల్స్ ను బట్టి వేధింపుల మోతాదును ఎక్కువ చేస్తారు.
రుణం సకాలంలో చెల్లించకపోతే, గడువు తేదీ ముగిశాక మొదటి 3 రోజుల వరకు అయితే వారిని ఎస్1 అనే లిస్టులో పెడతారు. గడువు ముగిశాక 4 నుంచి 10 రోజులు అయినా రుణం చెల్లించని వారిని ఎస్2 లిస్టులో, 11 నుంచి 30 రోజులు అయినా రుణం చెల్లించని వారిని ఎస్3 లిస్ట్‌లో పెడతారు. లిస్ట్‌లో ఉన్న వారిని బట్టి వారికి వేధింపులు ఒక మోస్తరు నుంచి తారా స్థాయి వరకు ఉంటాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున బాధితులు తమకు వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
కాగా ఆనియన్ క్రెడిట్ అండ్ క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ సంస్థలు.. క్యాష్ మామా, లోన్ జోన్, ధనా ధన్ లోన్, క్యాష్ అప్, క్యాష్ బస్, మేరా లోన్, క్యాష్ జోన్ అనే యాప్‌లను క్రియేట్ చేశారు. వాటిల్లో క్యాష్ బస్, క్యాష్ అప్ అనే 2 యాప్‌లను ఢిల్లీకి చెందిన ఏషియా ఇన్నో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు. ఇక మేరా లోన్, క్యాష్ జోన్ అనే యాప్‌లను బెంగళూరుకు చెందిన బ్లూ షీల్డ్ ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి విక్రయించారు. ఇక క్యాష్ మామా అనే యాప్‌ను ఆనియన్ క్రెడిట్ కంపెనీ నిర్వహిస్తుండగా, ధనా ధన్ లోన్, లోన్ జోన్ యాప్‌లను క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ నిర్వహిస్తోంది. అయితే పేర్లు వేరైనా నిజానికి ఈ రెండు కంపెనీలు ఒక్కటే అని చెప్పవచ్చు. నిందితుల్లో ఒకడైన కె.శరత్ చంద్ర ఈ రెండు కంపెనీలను స్థాపించాడు. నగరంలో మొత్తం 110 మంది ఉద్యోగులతో ఈ రెండు కంపెనీలను అతను నిర్వహిస్తున్నాడు. ఈ రెండు కంపెనీలకు కలిపి మొత్తం 1.50 లక్షల మంది కస్టమర్లు ఉండగా, 70 వేల మంది యాక్టివ్ కస్టమర్లు ఉన్నారు. అంటే వీరందరూ ప్రస్తుతం లోన్లు తీసుకున్న వారు అన్నమాట. ఇక లోన్ గడువు 7 రోజులు ముగియగానే రుణం చెల్లించని వారిని పైన తెలిపిన విధంగా లిస్ట్‌ల రూపంలో విభజించి వారిని వేధించడం మొదలు పెడతారు.
కాగా అనుమతి లేని లోన్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తీసేయాలని ఆదేశిస్తూ ఇప్పటికే సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్‌కు నోటీసులు పంపామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలకు లోన్ యాప్‌లపై పలు సూచనలు చేశారు.
* ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలచే గుర్తింపు లేని లోన్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోకూడదు.
* వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఇతరులకు ఇవ్వరాదు.
* వినియోగదారులు తాము వాడే యాప్‌కు సంబంధించి ఆర్బీఐ గుర్తింపు ఉందా, లేదా అనే వివరాలను ఒక్కసారి పరిశీలించాలి. యాప్‌కు లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
* ఫోన్లోని కాంటాక్ట్స్, ఫైల్స్, గ్యాలరీలకు యాక్సెస్ ఇవ్వాలని అడిగే యాప్‌లను డౌన్లోడ్ చేసుకోకూడదు.