శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): తాను పనిచేస్తున్న స్టోర్‌లో ఓ యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ప్రవర్తిస్తూ ఫోన్లను దొంగిలించాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్‌కు చిక్కాడు. దీంతో కటకటాల పాలయ్యాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని క్రోమా స్టోర్‌లో సీలం దుర్గ సాయి వెంకట తేజ (25) అనే యువకుడు గత 7 నెలల నుంచి సేల్స్ బాయ్ గా పనిచేస్తూ చింతల్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ స్టోర్‌లో డిస్ ప్లేలో ఉంచిన ఫోన్లను దొంగిలించాడు. అలా మొత్తం 4 ఫోన్లు పోవడంతో అనుమానం వచ్చిన స్టోర్ నిర్వాహకులు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సీసీటీవీ ఫుటేజ్‌లో వెంకట తేజ ఆ ఫోన్లను దొంగిలించినట్లు తేలింది. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి దొంగిలించబడిన ఫోన్లను రికవరీ చేశారు.