మియాపూర్, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 24వ తేదీన ఉదయం 5 నుంచి 6.30 గంటల సమయంలో మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా మెట్రో పిల్లర్ నంబర్ 622 బస్టాప్ దగ్గర అతన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి లేబర్‌గా పనిచేస్తూ ఉండవచ్చని, అతని వయస్సు సుమారుగా 35 ఏళ్లు ఉంటాయని, ఎత్తు 5.5 అడుగులు ఉంటాడని, చామన ఛాయ రంగులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే 9490617129 అనే ఫోన్ నంబర్‌కి కాల్ చేయాలని పోలీసులు తెలిపారు.