శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత చర్చలు జరిపారు. లక్నో నగరంలో విజయవంతంగా అమలవుతున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, పట్టణాభివృద్ధి, రహదారుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి, వాటిని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎలా అమలు చేయవచ్చోనని అభిప్రాయాలు సేకరించారు.ఈ అవగాహనల ఆధారంగా, హైదరాబాద్ నగరంలో మరింత అభివృద్ధిని సాధించడం, మౌలిక వసతులను మెరుగుపరచడం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుందని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.