నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు కుమార్తె సురభి వాణిదేవి పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి పేరును ఇదివరకే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ నామినేషన్ కు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగలడంతో మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చివరి నిమిషంలో సురభి వాణిదేవి పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. సోమవారం సురభి వాణిదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మార్చి 14వ తేదీన పోలింగ్ జరుగనుండగా, 17వ తేదీ ఓట్ల లెక్కింపు ప్రకియ చేపట్టనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల్లో దాదాపు 5.60 లక్షల పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకుని పోలింగ్‌లో పాల్గొననున్నారు.