
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఈ క్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. మొన్న కురిసిన భారీ వర్షాలు మిగిల్చిన చేదు అనుభవాలు మరిచిపోకముందే మరో విపత్తు మన ముందుకు రావడం తీవ్ర బాధాకరమన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం జిహెచ్ఎంసి, రెవెన్యూ, డిఆర్ఎఫ్, ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. మానవ ప్రయత్నంగా ఎలాంటి లోటు పాట్లు లేకుండా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు, బస్తీ వాసుల పట్ల ఒకరికొకరు సానుకూల, మానవతా దృక్పథంతో స్పందించి తగిన సహాయ సహకారాలు అందించుకోవాలని కోరారు.





