ఆరోగ్యమిత్ర సేవలు అభినందనీయం : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

నమస్తే శేరిలింగంపల్లి:మారుతున్న జీవన సరళికి అనుగుణంగా మనుషుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించుకుపోతుందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో గజ్జల యోగానంద్ జీవై ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యమిత్ర పేరిట ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ సేవలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవకోటి మనుగడకు ఆరోగ్యమే ప్రధానమని, మన భారతీయుల జీవితం యుగయుగాలుగా ఆరోగ్యానికి మూలమైన ప్రకృతితో మమేకమవుతూ వచ్చిందన్నారు. భారత ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛభారత్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటి స్ఫూర్తితో గజ్జల యోగానంద్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. ఆరోగ్యమిత్ర టెలీమెడిసిన్ సేవలకు సాంకేతిక సహకారం అందిస్తున్న ధనుష్ హెల్త్ కేర్ అధినేత డీఎస్ఎన్ మూర్తి ప్రాజెక్టు పనితీరును వివరించారు. యోగానంద్ మాట్లాడుతూ మన భారతీయులది మొదటి నుంచీ ఆరోగ్యమిత్ర సంస్కృతి అని పేర్కొన్నారు. మారుతున్న కాలంలో ఆరోగ్యప్రమాణాలు పతనం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బాధ్యత గల పౌరునిగా తమ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యమిత్ర పేరిట టెలీమెడిసిన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ ఆరోగ్యమిత్ర టెలీమెడిసిన్ సేవల కోసం నమోదు చేసుకున్నవారు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సేవలు పొందవచ్చని, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి నిపుణులైన వైద్యుల సలహాలు పొందవచ్చని తెలిపారు. ధనుష్ హెల్త్‌కేర్ సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆరోగ్యమిత్ర టెలీమెడిసిన్ సేవలను అధునాతన టెక్నాలజీ ద్వారా నాణ్యతా ప్రమాణాలతో అందించేందుకు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలను వినియోగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక్ కిషన్ పంపాటి, సామ రంగారెడ్డి, బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య మిత్ర టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభిస్తున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
మాట్లాడుతున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here