నమస్తే శేరిలింగంపల్లి: అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత సాయిబాబా దేవాలయంలో చోరి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో కొందరు దొంగలు ఆలయం ప్రధాన ద్వారంకు ఉన్న గొళ్లెం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. సీసీ కెమెరా వైర్లను కత్తరించారు. ఆలయం లోపలికి వెళ్లి పెద్ద హుండీని తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 4 తులాల బంగారంతో తయారుచేసిన సాయిబాబా చెవి కమ్మలు, బొట్టును దోచుకెల్లారు. అదేవిధంగా అక్కడే ఉన్న రెండు చిన్న హుండీలను తీసుకెళ్లారు. వాటిలో దాదాపు రూ.30 వేల వరకు నగదు ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు బావిస్తున్నారు.
ఆలయం గురించి తెలిసిన వారి పనే..?
దుండగులు ఆలయంలోకి చొరబడి ముందు ఆలయ ప్రాంగణంలో నివసించే పూజారుల ఇళ్లకు బయట నుంచి గడియ పెట్టారు. దీంతో సకాలంలో వారు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆలయం గురించి తెలిసిన వారు, లేద కొంత కాలంగా రెక్కి నిర్వహించిన తర్వాత ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని చందానగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించగా, సీసీటీవీ ఫుటేజీ రికార్డుల ఆధారంగా దొంగలను పట్టుకుంటామని వారు తెలిపారు.