అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  • అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్స్ జెఏసి డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్స్ జెఏసి డిమాండ్ చేసింది. సమస్యలను పరిష్కరించకుంటే సెప్టెంబర్ 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ కు శేరిలింగంపల్లి మండలం తహసీల్దార్ కు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్ వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారని , వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారేనని, గత 45 సంవత్సరాలకు పైగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేదలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. కానీ వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదని తెలిపారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ఉద్యోగులకు సకల సౌకర్యాలు అందిస్తున్నారని, అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కల్పించాలన్నారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని కోరారు.

ఐతే అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలపైన ఆగస్టు 18న అంగన్ వాడీ సంఘాలతో నిర్వహించిన జాయింట్ సమావేశంలో ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని, కానీ ఆగస్టు 25న అందుకు భిన్నంగా హామీలు ఇచ్చారన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చి, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ. 5 లక్షలు చెల్లించాలని, గత నిబంధనల ప్రకారం ఎస్ఎస్సి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం, సీనియారిటీ ప్రకారం వేతనం, 2018 అక్టోబర్ లో కేంద్రం పెంచిన వేతనం అంగన్ వాడి టీచర్లకు రూ. 1,500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు 1.250, రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here