- ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు
- ట్రాఫిక్ అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని విజయ నగర్ కాలనీ, నవోదయ కాలనీలలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులతో కలిసి ఆయా కాలనీలలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రచించాలని, కాలనీలలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.
అవసరం ఉన్న చోట డివైడర్లు, రోడ్డు మళ్లింపు చర్యలను తీసుకోవాలని, రోడ్డు దాటే వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పోలీసు సిబ్బంది తెలిపారు. వాహనాల రద్దీ వల్ల ఉదయం, సాయంత్రం రహదారులు నిత్యం రద్దీగా మారి కాలనీల వాసులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ట్రాఫిక్ వల్ల నరకయాతన అనుభవిస్తున్నారని, గంటల కొద్దీ రోడ్డు పైన ఉండాల్సి వస్తుందని, ట్రాఫిక్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశీనాథ్ యాదవ్, సత్యనారాయణ, నవీన్, స్వరూప, లావణ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.