శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి బీజేవైఎం నాయకులు భారీ ర్యాలీగా వెళ్లి టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నుంచి బీజేవైఎం నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందన్నారు. తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు చెల్లిస్తామన్న నిరుద్యోగ భృతి తక్షణమే విడుదల చేయాలని, 2 లక్షలకుపైగా ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసిన బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట్, గాంధీనగర్, నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం విడుదల చేశారు.