- విప్రో సర్కిల్ వద్ద కారును ఢీకొన్న టిప్పర్ లారీ
- ఆదివారం ఉదయం 2.48 గం. లకు ఘటన
గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): అతివేగం కారణంగా గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఆదివారం ఉదయం 2:48 గం.ల సమయంలో ట్రిపుల్ ఐటీ నుంచి గౌలిదొడ్డి వైపు వేగంగా వెళుతున్న మారుతి స్విఫ్ట్ కారు(ఏపీ 39 ఈడీ 5229)ను కోకాపేట్ వైపు నుంచి ట్రిపుల్ ఐటీ వైపు వస్తున్న టిప్పర్(టీఎస్ 05 యూబి 2451) వేగంగా వస్తూ ఢీకొట్టింది. దీంతో టిప్పర్ పల్టీ కొట్టగా, కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
మృతులంతా మాదాపూర్‌లోని మారుతి మెన్స్ హాస్టల్లో నివాసం ఉంటున్న వారిగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెంకు చెందింన కాట్రగడ్డ సంతోష్(25) సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెల్లూరు వేదాయపాళెం త్యాగరాజనగర్‌కు చెందిన కొల్లూరు పవన్‌కుమార్(24)ప్రైవేట్ ఉద్యోగి, తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి వుయ్యూరివారి మెరకకు చెందిన చింతా మనోహర్(23) ఫస్ట్లూక్ 3డీ యానిమేషన్ ఉద్యోగి, విజయవాడ సుందరయ్య వీదికి చెందిన పప్పు భరద్వాజ్(20) ప్రైవేట్ ఉద్యోగి, నెల్లూరుకు చెందన రోషన్(23) ప్రైవేట్ ఉద్యోగులుగా పోలీసులు దృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ





