శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రజా రవాణా, సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ట్రాఫిక్ రద్దీతో పాటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని సూచించారు. రాయదుర్గంలోని టీ-హబ్‌లో సురక్షిత, సుస్థిర రవాణా వ్యవస్థ లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన సైబరాబాద్ మూవ్స్-2026 సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి, సీఎంసీ కమిషనర్ సృజనతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంపొందించడం, రోడ్డు భద్రత, పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వారంలో కనీసం ఒకరోజైనా సైకిల్‌పై ప్రయాణించాలని సూచించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొని తమ విలువైన ఆలోచనలు, సూచనలు అందించడం అభినందనీయమన్నారు. వారి సలహాలను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించడం ద్వారా ఉద్యోగులకు కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. డబుల్ డెక్కర్ రవాణా వ్యవస్థను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, మెట్రో, ఫ్లైఓవర్లు, రోడ్డు మార్గాలను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న సైబరాబాద్ ప్రాంతంలో జనాభా అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో సరైన ప్రణాళికలు పాటించడం లేదని, అస్తవ్యస్తంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాంధీ పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లను ప్రజలకు అనుకూలంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్మించాలని సూచించారు. మొబైల్, ఫైబర్ నెట్వర్క్, కమ్యూనికేషన్ సంస్థలతో పాటు గ్యాస్, విద్యుత్, జలమండలి సంస్థలు రోడ్లను ఇష్టానుసారంగా తవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా సంస్థల పనులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, తవ్వకాలు పూర్తయిన వెంటనే రోడ్లను తిరిగి యథాస్థితికి తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ వాహనాల రాకపోకలపై నిర్దేశించిన సమయ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైకి రావాల్సిన వాహనాలు ఉదయం 9 గంటలకే రోడ్లపైకి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో సెల్ఫోన్లలో మాట్లాడుతూ, రీల్స్, సినిమాలు చూస్తూ ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తోందని హెచ్చరించారు. ఇలాంటి డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ విభాగంలో అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించి, వారి సలహాలు, సూచనల ఆధారంగా మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని గాంధీ కోరారు. సురక్షిత ప్రయాణం, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.





