శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మార్తాండ నగర్లో మురుగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు అధికంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తీవ్రమైన పౌర సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలువురు రాజకీయ పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు మార్తాండ నగర్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఆశావహుడు (బీఆర్ఎస్) ఎం.డీ. అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతూ.. మార్తాండ నగర్లో నెలకొన్న మురుగునీటి సమస్యను అధికారులు తక్షణమే గుర్తించి, యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.






