శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ విషయంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీసుకున్న నిర్ణయాలపై శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా మహిళల రాజకీయ సాధికారత పట్ల బీఆర్ఎస్ తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకుందని ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు డీలిమిటేషన్ అంశంలో దక్షిణాది రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు రాజకీయాల్లో సముచిత అవకాశాలు కల్పించే విషయంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని బొబ్బ నవత రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా నిలిచిన కేటీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న గౌరవం, నిబద్ధత ఈ నిర్ణయంతో మరోసారి స్పష్టమయ్యాయని తెలిపారు. మహిళల సంపూర్ణ మద్దతుతో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహిళా సంక్షేమం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో అనుసరిస్తున్న వైఖరిని బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. మహిళల రాజకీయ ఎదుగుదలకు సంబంధించిన కీలక అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆ పార్టీ ద్వంద్వ విధానాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాలపై ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని, కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో రాజకీయంగా పరాభవం తప్పదని ఆమె వ్యాఖ్యానించారు.





