శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): సర్వే నంబర్ 100 భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, ఎంఏ నగర్, స్టాలిన్ నగర్ కాలనీలలో నివసిస్తున్న ప్రజల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆయా కాలనీలలో పర్యటించి నివాసితులతో సమావేశమయ్యారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి కాలనీల వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. తాము ఎన్నో ఏళ్లుగా ఆయా కాలనీలలో నివసిస్తున్నామని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. తమ సమస్యను మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని గాంధీని కోరారు. గతంలో ఆయన హయాంలో కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే అమాయక కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రశాంత్ నగర్, ఎంఏ నగర్, స్టాలిన్ నగర్ కాలనీవాసుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాలనీవాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తాయని, అలాంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.
తన హయాంలో ప్రశాంత్ నగర్, ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, పీఏ నగర్ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థతో పాటు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించామని గాంధీ పేర్కొన్నారు. ఆయా బస్తీలు, కాలనీలను ఆదర్శవంతమైన నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రశాంత్ నగర్, ఎంఏ నగర్, స్టాలిన్ నగర్ కాలనీల నివాసితులు తదితరులు పాల్గొన్నారు.





