శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన కార్యకలాపాలను కమిషనర్ సృజన సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించడంతో పాటు, కీలక కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ), డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ, బిల్డ్‌నౌ (BuildNow) దరఖాస్తులు, ప్రజా ఫిర్యాదులు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్), కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కోర్టు కేసులు తదితర అంశాలపై కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు.

వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సమస్యల పరిష్కారంలో సాధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనసాగుతున్న పనుల స్థితిగతులను పరిశీలించి, వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచాలని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలోని ప్రతి కార్యక్రమాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పెండింగ్ సమస్యలపై తక్షణమే తదుపరి చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని కార్యక్రమాలు నిర్ణీత కాలవ్యవధిలో సమర్థవంతంగా పూర్తయ్యేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.






