శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని 83 మంది లబ్ధిదారులకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. మొత్తం రూ.83,09,628 విలువైన చెక్కులను గురువారం వివేకానంద నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ చేశారు. కూకట్‌పల్లి మండల పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర నగర్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. 83 మంది లబ్ధిదారులకు రూ.83,09,628 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించడం సంతోషంగా ఉందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలుస్తున్నారని, పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా అండగా ఉంటున్నారని కొనియాడారు. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు భారంగా మారకూడదనే మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలు కుటుంబాల్లో ఆనందాన్ని నింపేలా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.





