మియాపూర్‌లో పేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలి: యంసిపిఐ(యు) డిమాండ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లోని సర్వే నంబర్లు 96, 99, 100 పరిధిలో ఉన్న ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ నివాసితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, సర్వే నంబర్లు 100, 101లోని మిగులు ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని యంసిపిఐ(యు) డిమాండ్ చేసింది. ప్రభుత్వ భూముల వేలం, అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని కోరుతూ గురువారం యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులతో కలిసి పార్టీ ప్రతినిధి బృందం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యంసిపిఐ(యు) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని భూములు ప్రభుత్వ భూములేనని, వాటి పరిరక్షణ కోసం పార్టీ నాలుగు దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. మాజీ శాసనసభ్యుడు, మద్ది కాయల ఓంకార్ 1994లో శాసనసభలో ఈ భూముల అంశాన్ని చర్చకు తీసుకురావడంతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెలుగులోకి వచ్చాయని గుర్తుచేశారు. ఆ సమయంలో యంసిపిఐ(యు) ఆధ్వర్యంలో మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఏడు బస్తీలు నిర్మించామని పేర్కొన్నారు. భూ ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రభుత్వాలను కోరుతూ అనేక పోరాటాలు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో పేదలకు నివాసాలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఇందులో భాగంగా సుమారు 30 సంవత్సరాల క్రితం ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ బస్తీలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం ఈ రెండు బస్తీల్లో 2వేల‌కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని వివరించారు. పోరాటాల ఫలితంగా ఇంటి నంబర్లు, ఆర్డీఓ ద్వారా పొజిషన్ సర్టిఫికెట్లు పొందడంతో పాటు రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారని తెలిపారు.

సర్వే నంబర్లు 100, 101లోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఆ భూముల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేసి వారి నివాసాలకు చట్టబద్ధత కల్పించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర పరిసరాలతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులకు వేలం వేయడం, విక్రయించడం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి పేరుతో వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాల వరకు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెబుతోందని విమర్శించారు. ప్రభుత్వ భూముల వేలం, అమ్మకాలను తక్షణమే విరమించుకుని, మియాపూర్ భూములతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరారు. పేదల నివాసాలకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదంశెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మియాపూర్ సర్వే నంబర్లు 100, 101లోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ఆ భూములను విక్రయించి, రాష్ట్ర సంక్షేమానికి రూ.60 వేల కోట్లు వినియోగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మూడు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ పేద, బలహీన వర్గాల కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాలకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పేదల ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని, మిగులు ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ భూముల్లో డిగ్రీ కళాశాల, 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కర్ర దానయ్య, అంగడి పుష్ప, పి. భాగ్యమ్మ, తాండ్ర కళావతి తదితరులు ప్రసంగించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు జి. శివాని, బి.కె. నారాయణ, పార్టీ సభ్యులు ఎన్. నాగభూషణం, డి. శ్రీనివాసులు, కొడిపాక రాజు, ధారా లక్ష్మి, గీత, సుల్తానా బేగం, రజియా బేగం, డప్పు రాజు, ఈశ్వరమ్మ, వి. అనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here