శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్‌లో రాత్రి వేళ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి చోరీకి గురైన సుమారు 35 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నేరం జరిగిన నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని శిల్పా వ్యాలీ, సారా ప్రైడ్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే పోతిరెడ్డి అనుష్ కుమార్ రెడ్డి (34) సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య అతని ఫ్లాట్ నంబర్ 502లో ఎవరూ లేని సమయాన్ని నిందితుడు అదునుగా తీసుకున్నాడు.

టెర్రస్ నుంచి తాడు సహాయంతో బాల్కనీలోకి ప్రవేశించి, స్లైడింగ్ డోర్‌తో పాటు ఇంట్లోని అల్మారాను పగులగొట్టి సుమారు 35 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులను దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు క్రైమ్ నంబర్ 1957/2026 కింద BNS సెక్షన్లు 331(4), 305(a) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలి క్రైమ్ టీమ్ ఈ నెల 8న గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని లిమ్మక అనంత్ కుమార్ (28)గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా మేస్త్రీ కాగా, బోరబండలోని సఫ్దర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
నిందితుడు Dafa Bet యాప్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి, ఆర్థిక అవసరాల కోసం ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి నుంచి ఈ మేరకు పోలీసులు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 35 తులాల బంగారు ఆభరణాలు,2 కిలోల వెండి వస్తువులు, హోండా యాక్టివా స్కూటర్ (TG 08 BC 9862), పోవా మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి జోన్ డీసీపీ CH. శ్రీనివాస్, అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి, నార్సింగి డివిజన్ ఏసీపీ, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించారు. గచ్చిబౌలి డీఐ, పోలీసు సిబ్బంది సమన్వయంతో నిందితుడిని నాలుగు రోజుల్లోనే పట్టుకున్నారు. నిందితుడిని న్యాయపరమైన రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.





